పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/489

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-04 మాళవిగౌళ సం: 02-489 అధ్యాత్మ

పల్లవి:

నీచిత్త మిందరినేరుపు నేరమి
తోచి కాచి యిటు తుద కీడెర్చె

చ. 1:

దేవతలపాలు తీరని పుణ్యము
ఆవలఁ బాపం బసురలది
భావింప మనుజులపాలివి రెండును
శ్రీవల్లభ నీనేసిన మాయ

చ. 2:

వేదశాస్త్రములు విజ్ఞానమూలము
ఆది నసత్యము లజ్ఞానమూలము
సాదింప రెండును జగత్తుమూలము
భేదించి యివి నీపెరరేఁపణలు

చ. 3:

కావింపఁ గర్మము కాయము చేతిది
భావము చేతిది పరమము
తావుల రెండునుఁ దప్పని ప్రకృతివి
శ్రీవేంకటేశ్వర చేఁతలు నీవి