పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/479

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-06 బౌళి సం: 02-479 అధ్యాత్మ వైరాగ్య చింత

పల్లవి:

హితవే సేసుఁ గాకాతఁడేల మానును
మితి నాతని దూరక మెచ్చవలెఁ గాక

చ. 1:

ఆగమభోగములకు హరి నాలో నున్నవాఁడు
చేగదేర నాకు మేలే చింతించుఁ గాక
సాగిన ప్రపంచములో సంసారిఁ జేసినవాఁడు
యే గతి రక్షించఁ దానే ఇన్నిటికౌఁ గాక

చ. 2:

భూమిమీఁద దేహమిచ్చి పుట్టించినట్టివాఁడు
ప్రేమతో నన్నపానాలు పెట్టుఁ గాక
ఆమని పంచేంద్రియాల నటు పెడరేఁచేవాఁడు
నేమపు బుత్రదారలై నిండుకుండు గాక

చ. 3:

ఇహపరములకుఁ దా నిరవైనట్టివాఁడు
సహజాన నన్నియును జరపుఁ గాక
వహి శ్రీవేంకటాద్రిపై వరములిచ్చేటివాఁడు
మహిమతో మమ్మునేలి మన్నించుఁ గాక