పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/477

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-04 ధన్నాసి సం: 02-477 అధ్యాత్మ

పల్లవి:

ఒక్కమనసున నే నుండేఁగాక
యెక్కడిపనులు దానే యెఱఁగఁడా

చ. 1:

బలుదేహ మిచ్చువాఁడు ప్రాణము వోసినవాఁడు
తలఁపొసగినవాఁడు దైవమేకాఁడా
వెలుపలి లంపటాలు వేవేలు గడించి తాను
మలసి ఇంతలో నన్ను మఱచీనా

చ. 2:

జగము లేలేటివాఁడు సంసారిఁ జేసినవాఁడు
తగులై యుండినవాఁడు తానేకాఁడా
బెగడకుండ దినాలు పెరుగఁజేసేటివాఁడు
తగినట్టు నడపించఁ దా నేరఁడా

చ. 3:

మొదలై యుండేటివాఁడు ముందరఁ దుదయ్యేవాఁడు
యెదలోవాఁడు శ్రీవేంకటేశుఁడే కాఁడా
చదివించి బుద్ధులిచ్చి చైతన్యమైనవాఁడు
పొదిగి నాదాపుదండై భోగించఁడా