పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/476

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-03 మలహరి సం: 02-476 వైరాగ్య చింత

పల్లవి:

మగఁడు విడిచినా మామ విడువనియట్టు
నెగడిన వేమిసేయు నేనే రోయఁ గాని

చ. 1:

నరకము నను రోసి సురలోకాన విడిచె
నిరయముతోవ రోసి నేనే విడువఁ గాని
పరగి యోనులు రోసి బట్టబాయిట వేసే
సొరిది యోనుల రోసి చోరక నే మానఁ గాని

చ. 2:

పాపము రోసి నన్ను ప్రపంచాన విడిచె
పాపము సేయక రోసి పట్టకుండఁ గాని నేను
యేపున దేహము రోసి యింద్రలోకాన విడిచె
కైపువేసి రోయక నేఁగాయము మోచితిఁ గాని

చ. 3:

మాయలెల్ల నన్ను రోసి మనసులోన విడిచె
మాయల నే విడువక మగుడఁ దగిలేఁ గాన
నాయల(?) వేమి విడిచినాను శ్రీవేంకటేశ
పాయక నన్నేలితి నీభాగ్యము విడువఁ గాని