పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/474

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-01 దేసాళం సం: 02-474 శరణాగతి

పల్లవి:

ఇంతటఁ బో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల
దొంతి ఇంద్రియాలకెల్లఁ దొలఁగి వుంటేను

చ. 1:

మాటలాడవచ్చుఁ గాని మనసులు పట్టరాదు
చాటువకెక్కినయట్టి సతులఁ గంటే
కోటి చదువఁగవచ్చు కోపము నిలుపరాదు
జూటరై వొకఁడు దన్ను సోఁకనాడితేను

చ. 2:

అందరి దూషించవచ్చు నాసలు మానఁగరాదు
కందువైన మించుల బంగారు గంటే
అందాల మొక్కఁగవచ్చు హరిభక్తి సేయరాదు
పొందుల సంసారపు భోగము గంటేను

చ. 3:

మొదలఁ బుట్టగవచ్చు మోక్షముఁ బొందఁగరాదు
పొదిగి పుణ్యరాసుల భోగము గంటే
యెదుట శ్రీవేంకటేశ ఇదివో నీశరణంటే
కదిసితి నిట్టే పో నీకరుణ గంటేను