పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/473

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-06 గుండక్రియ సం: 02-473 అధ్యాత్మ

పల్లవి:

తానే తెలియుఁ గాక తలఁచఁగ నెట్టువచ్చు
నానాగతుల తన నాటకపుమాయ

చ. 1:

అట్టె యేఁబదియైన యక్షరాలలోనట
తిట్టులట వొకకొన్ని దీవెనలటా
మట్టుతో వేదములట మంత్రములట కొన్ని
యిట్టివి చిక్కులు భూమి నిఁకనెన్ని గలవో

చ. 2:

కదిసిన యఱువదిగడియలలోనట
పొదలు నడకలట భోగములటా
నిదురట వొకకొంత నేరుపులు కొన్నియట
యెదుట చూడఁగఁ జూడ నిఁక నెన్ని గలవో

చ. 3:

రేవగలు కన్నులివి రెంటిలోనేయట
దైవము జీవులలోనే తానకమట
శ్రీవేంకటాద్రిమీఁద జెలఁగి యా(గెనా?)తఁడే యట
యేవంక నీచేఁతలు యిఁక నెన్నిగలవో