పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/471

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-04 సామంతం సం: 02-471 నృసింహ

పల్లవి:

సింగారమూరితివి చిత్తజగురుడఁవు
సంగతిఁ జూచేరు మిమ్ము సాసముఖా

చ. 1:

పూవులతెప్పలమీఁద పొలఁతులు నీవు నెక్కి
పూవులాకసము మోవఁ బూచి చల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు గొలువఁగా
సావధానమగు నీకు సాసముఖా

చ. 2:

అంగరంగవైభవాల నమరకామినులాడ
నింగినుండి దేవతలు నిన్నుఁ జూడఁగా
సంగీతతాళవాద్య చతురతలు మెరయ
సంగడిఁ దేలేటి మీకు సాసముఖా

చ. 3:

పరగఁ గోనేటిలోన పసిడి మేడనుండి
అరిది నిందిరయు నీవారగించి
గరిమ శ్రీవేంకటేశ కనులపండువ గాఁగ
సరవి నోలాడు మీకు సాసముఖా