పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/470

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-03 సాళంగనాట సం: 02-470 దశావతారములు

పల్లవి:

కంటిరా వింటిరా కమలనాభుని శక్తి
వొంటి నితని శరణ మొకటే వుపాయము

చ. 1:

యీతని నాభిఁ బొడమె యెక్కువైన బ్రహ్మయు
యీతఁడే రక్షించినాఁడు యింద్రాదుల
యీతఁడాకుమీఁద దేలె నేకార్ణవమునాఁడు
యీతఁడే పో హరి మనకిందరికి దైవము

చ. 2:

యీతడే యసురబాధ లిన్నియుఁ బరిహరించె-
నీతని మూఁడడుగులే యీ లోకాలు
యీతఁడే మూలమంటే నేతెంచి కరిఁ గాచె
నీతనికంటే వేల్పు లిఁక మరి కలరా

చ. 3:

యీతఁడే వైకుంఠనాథుఁ దీతఁడే రమానాథుఁ-
డీతఁడే వేదోక్తదైవ మిన్నిటాఁ దానె
యీతఁడే అంతర్యామి యీ చరాచరములకు
నీతఁడే శ్రీవేంకటేశుఁ డిహపరధనము