పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/469

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-02 సాళంగం సం: 02-469 భక్తి

పల్లవి:

నానాభక్తులివి నరుల మార్గములు
యే నెపాననైనా నాతఁ డియ్యకొను భక్తి

చ. 1:

హరిఁకిఁగా వాదించు టది ఉన్మాదభక్తి
పరులఁ గొలువకుంటే పతివ్రతాభక్తి
అరసి యాత్మఁ గనుటదియే విజ్ఞానభక్తి
అరమరచి చొక్కుటే ఆనందభక్తి

చ. 2:

అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి
ఆతని దాసుల సేవే అదియే తురీయభక్తి
క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి
అతఁడే గతని వుండుటది వైరాగ్యభక్తి

చ. 3:

అట్టె స్వతంత్రుఁడౌటే అది రాజసభక్తి
నెట్టన శరణనుటే నిర్మలభక్తి
గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి
తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి