పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/467

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-06 శంకరాభరణం సం: 02-467 అధ్యాత్మ

పల్లవి:

హరియు నొక్కఁడే గురి ఆత్మలో నొక్కటే గురి
విరివి నెంత చదివినా వేరుగాఁ బొయ్యీనా

చ. 1:

అందరిచూపులు నొక్కటైనందుకు గురి
యెందూఁ గొండ కొండేకాక యితరముగాఁ జూచేరా
అందరిరుచులు నొక్క టైనందుకు గురి
చెంది తీపు తీపే కాక చేఁదుగాఁ జేకొనేరా

చ. 2:

వొప్పుగా నందరివూర్పు లొక్కటైనందుకు గురి
కప్పుర మదేకాక కస్తూరిగా మూఁకొనేరా
యెప్పుడూ నిందరి వినికేకమైనందుకు గురి
తిప్పి తిట్టు తిట్టేకాక దీవెనగా వినేరా

చ. 3:

యీరీతి నిందరిచిత్త మేకమైనందుకు గురి
మేరతో సూర్యోదయము మించి రేతిరయ్యీనా
తేరి శ్రీవేంకటపతి దేవుఁడైనందుకు గురి
కోరినవారి వరాలే కొంగుపైఁడి గాదా