పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/463

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-02 శంకరాభరణం సం: 02-463 నృసింహ

పల్లవి:

ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
కొంత నాకుఁ దెలుపరో గురువులాల

చ. 1:

తనువూ హరియే తలఁపూ హరియే
వినికి మనికియును విష్ణుఁడే
కనుఁగొను చూపులు కమలనాభుఁడే
యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో

చ. 2:

లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే
వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే
చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే
యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో

చ. 3:

వెనకను కృష్ణుఁడే వెస ముం దచ్యుతుఁడే
కొనమొదలు నడుము గోవిందుఁడే
యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను
అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో