పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/455

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-06 బౌళి సం: 02-455 ఉపమానములు

పల్లవి:

మరిగితి నేమి సేతు మగిడి నేనెందు వోదు
సరుస దైవమ నీకే శరణు చొచ్చేను

చ. 1:

తల్లి గోపించి మొత్తినఁ దనయుఁడు తల్లికొంగే
యెల్లగాఁ బట్టి పెనఁగి యేడిచినట్టు
వెల్లవిరై హరి నీవు విషయాలఁ జిక్కించితే
ఇల్లిదే నిన్నుఁ దలఁచి ఇటు దూరే నేను

చ. 2:

కన్నతండ్రి బాలునిఁ జంకంబెట్టి దించితేను
కొన్నేసి విలుచు ముద్దుగునిసినట్టు
వున్నతి నాలోనుండి వూరకే మాయ నాపై
బన్నితే నిన్నే సొలసి పగటులాడేను

చ. 3:

దైవము దాతవు నీవే తల్లివి దండ్రివి నీవే
భావించి చేపట్టితే నీ బంట నే నింతే
శ్రీవేంకటేశ నీవు చేకొని రక్షించఁగాను
జీవుఁడనయిన నేను చెలఁగి మొక్కేను