పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/452

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-03 గుజ్జరి సం: 02-452 అధ్యాత్మ

పల్లవి:

అందాఁకాఁ దాఁదానే అంత కెక్కుడు గాఁడు
ముందు వెన కెంచేనా ముఖ్యుఁడే యతడు

చ. 1:

చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా
అత్తల నతఁడు యోగియనఁబడును
సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా
వుత్తమవివేకియని వూహింపఁబడును

చ. 2:

భావము నభావమును పరికించి తెలిసెనా
కైవల్యనిలయుఁడని కానఁబడును
దైవంబుఁ దన్ను మతిఁ దలపోయ నేర్చెనా
జీవన్ముక్తుఁడని చెప్పఁబడు నతఁడు

చ. 3:

అడరి వైరాగ్యధన మార్జించనోపెనా
దిడువై జితేంద్రియస్థిరుఁడాతఁడు
జడియు శ్రీవేంకటేశ్వరుదాసుఁ డాయనా
బడిబడిఁ దుదఁ బరబ్రహ్మమే యతఁడు