పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/450

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-01 ధన్నాసి సం: 02-450 శరణాగతి

పల్లవి:

అటుగాన మోసపోక హరి నీకే అన్నియును
ఘటియించుటే యెక్కుడు కమలారమణ

చ. 1:

నిన్నుఁజూడని కన్నులు నీచువలకన్నులు
చిన్ని నీకథవినని చెవులు రాట్నపుఁ జెవులు
వున్నతి నీకడకు రాకున్న కాళ్లు మరగాళ్లు
సన్నుతిసేయని జిహ్వ హరి నుపజిహ్వ

చ. 2:

చేరి నిన్నుఁ బూజించని చేయి దంతెనపుఁజేయి
తారి నీకు మొక్కనట్టి తలయే పెడతల
సారె నీముద్రలేని భుజములు బుద్బుజములు
తేరి నీదాస్యములేని దేహము సందేహము

చ. 3:

వనమాలలున్న గ్రీవము కంబుగ్రీవము
ఘన మిది దెలియుటే కైవల్యము
యెనయ శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
అనుమానమెల్లఁ బాసె నన్నిటా నాకును