పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/449

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-06 శంకరాభరణం సం: 02-449

పల్లవి:

కానవచ్చె నిందులోన కారుణ్యనరసింహా
తానకమై నీకంటే దాస్యమే పో ఘనము

చ. 1:

యెనసి ప్రహ్లాదుఁడు యెక్కడఁ జూపునోయని
ననిచి లోకమెల్ల నరసింహగర్భములై
పనివూని వుంటి వటు భక్తపరతంత్రుఁడవై
తనిసి నీ వధికమో దాసులే యధికమో

చ. 2:

మక్కువ బ్రహ్మాదులు మానుపరాని కోపము
ఇక్కువై ప్రహ్లాదుఁడు యెదుట నిలిచితేను
తక్కక మానితి వట్టే దాసుని యాధీనమై
నిక్కి నీకింకరుఁడే నీకంటే బలువుఁడు

చ. 3:

ఆరసి కమ్మర ప్రహ్లాదవరదుఁడని
పేరువెట్టుకొంటి విట్టే బెరసి శ్రీవేంకటేశ
సారె నీశరణాగతిజనుని కాధీనమైతి-
వీరీతి నీదాసునికే యిదివో మొక్కేము