పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/445

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-02 బౌళి సం: 02-445 అధ్యాత్మ

పల్లవి:

అనలము సూర్యుఁడు నన్నిటందు వెలసిన (నా?)
ఘనపవిత్రమైనట్టు ఘనుఁడే పో జ్ఞాని

చ. 1:

కాంచనము అంటువడినఁ గలదా అందు నింద్యము
పెంచు ముట్టంటువడినఁ బెక్కువ దూష్యము గాక
అంచల సుజ్ఞానిఁ బాపమంటునా తాఁ జేసినాను
పంచల నజ్ఞానినైతేఁ బైకొనిఁ గాక

చ. 2:

యెఱుకగల నాలిక నింతైనా జిడ్డంటునా
యెఱుకలేనిచేత నింతా జిడ్డంటుఁ గాక
కఱతలయోగిని కర్మములివంటునా
చుఱచుఱ జడునైతేఁ జుట్టుకొనుఁ గాక

చ. 3:

తామెరపాకుల నీరు తగ నందు నంటునా
ఆమేర నెందైనాను నంటుఁ గాక
యీమేర శ్రీవేంకటేశుని దాసుఁడు భూమిఁ
గామించి తా నుండినానుఁ గడు మాయలంటునా