పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/443

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-06 దేవగాందారి. సం: 02-443 అధ్యాత్మ

పల్లవి:

వానికి ముదుల యిచ్చి వద్దని మానుపవే
శ్రీనారాయణ వీనిచేత నే వేసరితి

చ. 1:

నీకల్పితములే యీనిఖిలేంద్రియములు
యీకడ నీయింద్రియాల నెట్టు గెలువఁగవచ్చు
నీకడ నిన్నే కొలిచి నీయప్పణ దెచ్చి వానిఁ
బైకొని చోఁపుటగాక బలిమా రాచాజ్ఞతో

చ. 2:

నీపంపునఁ గప్పిన నిజమైన మాయ యిది
మాపాటివారెల్లా మహి నెట్టు దాఁటవచ్చు
మీపాదాలే కొల్చి మీయనుజ్ఞ గొని దాని
పైపైఁ దోయుటగాక బలిమా రాచాజ్ఞతో

చ. 3:

శ్రీవేంకటేశ నీచిక్కులే యీపుట్టుగులు
నీవు సేసే చేఁతలకు నే నెట్టు దొలఁగవచ్చు
నీవొద్ద శరణంటి నీయానతినే వాని
భావించి తోసితిఁగాక బలిమా రాచాజ్ఞతో