పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/441

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-04 సామంతం సం: 02-441 అధ్యాత్మ

పల్లవి:

నీసొమ్ము చెడకుండ నీవు చూచుకొనవయ్య
దాసుఁడ నేనింతే దైవమవు నీవు

చ. 1:

లోకము లేలుదువట లోకము లోపలి నేను
పైకొని నీవేలినట్టి బంటనే సుమ్మీ
ఆకడ నావుఁ గొంటే నావువెంట దూడయును
జోకలఁ గొన్నట్టివారి సొమ్మే కాదా

చ. 2:

చేరి నన్ను నీవే పుట్టించితివట నేఁ జేసే-
మేరతోఁ బుణ్యపాపాలు మీవే సుమ్మీ
ఆరుగ విత్తినవాఁడు ఆరుగలోపలి కంది
ఆరితేరి పండితేను ఆతనిదే కాదా

చ. 3:

శ్రీవేంకటేశ నీవు జీవాంతరాత్మవట
కావించి నాపాలఁ గలవే సుమ్మీ
కైవసమై చందురుఁడు కలువలజాతికెల్ల
భావింప సర్వవిధబంధువే కాఁడా