పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/440

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-03 శ్రీరాగం సం: 02-440 అధ్యాత్మ

పల్లవి:

చాలునిదే నావిరతి సకలసామ్రాజ్యము
నాలోని పని యెంతైనా నాకుఁ గలదు

చ. 1:

వడఁబడి పరులిండ్లవాకిలి గాచే నేను
వడి నాలో హరియున్న వాకిలి గాచేను
బడి నొకరిఁ గొలిచి బహురాజ్యమేలే నేను
యెడ నామనోరాజ్యమింతా నేలేను

చ. 2:

చేరి యొరులకుఁ బనిసేసి యలసే నేను
సారె నాయోగాభ్యాసాన నలసేను
అరసి నే నడుగఁగ నన్యులిచ్చేయీవులు
తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని

చ. 3:

అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల-
మందును మాయాకల్పిత మిందును మాయే
అందు నిందు శ్రీవేంకటాధీశుఁడే కర్త
అందైతేఁ బరతంత్రుఁడిందు నే స్వతంత్రుఁడ