పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/438

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-01 లలిత సం: 02-438 కృష్ణ

పల్లవి:

అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో
విని యాతని భజించు వివేకమా

చ. 1:

భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాననే మోచేటి దేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటి దేవుఁడ నేను

చ. 2:

దీపనాగ్నినై జీవదేహముల యన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
యేపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతుఁ దలఁపు మరపై దేవుఁడ నేను

చ. 3:

వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచేతా
ఆది నేనెరఁగఁదగిన యాదేవుఁడను
శ్రీదేవితోఁగూడి శ్రీవేంకటాద్రి మీఁద
పాదైన దేవుఁడను భావించ నేను