పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/434

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-03 బౌళి సం: 02-434 శరణాగతి

పల్లవి:

ఎట్టైనాఁగావకపోదు యే నెంత సేసినాను
యిట్టే నీకు శరణంటి నిదియే తెరఁగు

చ. 1:

చేకొని నే మొక్కఁగాను చేతులు గోయఁగరాదు
ఆకడఁ దప్పుకుఁ దగినాజ్ఞ మానరాదు
కైకొని యపరాధాలే కావించితి నెన్నైనా
యీకడ నీశరణంటి నిఁకనో తెరఁగు

చ. 2:

చిక్కి దైన్యపడఁగాను చెలఁగి ఖండించరాదు
చక్కఁగా నాద్రోహాలు సైరించరాదు
అక్కడఁ జూచిన శరణాగతబిరుదు నీకు
యిక్కడ నీశరణంటి నిఁకనో తెరఁగు

చ. 3:

సేవసేయుచుండఁగాను జీతము మానుపరాదు
యీవిధి నాన దోసితే నిందుకోరాదు
దేవుఁడ నిన్నుఁ గొలిచి తెగి కర్మా లుడిగితి
యీవల శ్రీవేంకటేశ ఇఁకనో తెరఁగు