పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/433

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-02 గుండక్రియ సం: 02-433 శరణాగతి

పల్లవి:

నేనేమిఁ జేయఁగలేను నీవు పరిపూర్ణుఁడవు
హీనుఁడ నే నధికుఁడ విన్నిటా నీవు

చ. 1:

దండము వెట్టుట నాది తప్పు లోఁగొనుట నీది
నిండి నీవెప్పుడు దయానిధివి గాన
అండఁ బేరుకొంట నాది అందుకు నూఁకొంట నీది
దండియైన దేవదేవో త్తముఁడవు గాన

చ. 2:

శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది
పరమ పురుష శ్రీపతివి నీవు
విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది
పొరి నీవు భక్తసులభుఁడ వటుగాన

చ. 3:

దాసుఁడననుట నాది తప్పక యేలుట నీది
ఆసదీర్చే వరదుఁడ వటుగాన
నీసేవ యొక్కటి నాది నిచ్చలుఁ గైకొంట నీది
యీసులేని శ్రీవేంకటేశుఁడవు గాన