పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/432

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-01 దేవగాంధారి. సం: 02-432 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి యంజనాద్రిమీఁది రూపము

చ. 1:

వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

చ. 2:

పాలజలనిధిలోనఁ బవళించే రూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదే శేషగిరిమీఁది రూపము

చ. 3:

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీఁది కొన రూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రినిదే రూపము