పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/430

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-05 మాళవిగౌళ సం: 02-430 శరణాగతి

పల్లవి:

కలియుగ మెటులైనాఁ గలదుగా నీకరుణ
జలజాక్ష హరి హరి సర్వేశ్వరా

చ. 1:

పాపమెంత గలిగినఁ బరిహరించేయందుకు
నాపాలఁ గలదుగా నీనామము
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు
చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు

చ. 2:

ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను
సరిఁ గావఁగద్దుగా నీ శరణాగతి
గరిమఁ గర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ
నిరతిఁ గలదు గా నీ భక్తి నాకు

చ. 3:

హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య
సతమై కలదుగా నీసంకీర్తన
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ
గతి గలదుగా నీకమలాదేవి