పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/429

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-04 మాళవి సం: 02-429 కృష్ణ

పల్లవి:

అరు దరుదు నీమహి మతిమానుషము చూడ
పురుషోత్తమను దివ్యపుర జగన్నాథా

చ. 1:

పసులఁ గాచే దేడ బ్రహ్మ నుతియించు టేడ
సిసువౌ టేడ నాలుగుచేత లేడ
కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు టేడ
వసమా నిన్నుఁ బొగడ వరజగన్నాథా

చ. 2:

జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ
తనివెన్న ముచ్చి మేడ దైవికమేడ
పని బండిబోయిఁడేడ బాణుని నరకు టేడ
వినఁ గత నీమహిమ విష్ణు జగన్నాథా

చ. 3:

కమ్మి రోలఁ గట్టు టేడ గరుడవాహన మేడ
దొమ్మి భద్రసుభద్రుల తోఁబుట్టు వేడ
చిమ్ముల నిలగిరిని (?) శ్రీవేంకటాద్రిమీఁద-
నుమ్మడి నిరవుకొంటివో జగన్నాథా