పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/427

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-02 కాంబోది సం: 02-427 అద్వైతము

పల్లవి:

నన్నెరఁగలేనయ్యో నాయంతర్యామై
వున్నతపు హరి నాలో నున్నాఁడట

చ. 1:

యిల నేడుజానల మేనిందులోనివాఁడ నింతే
తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపొయ్యీని
కలువరేకులంతేసి కన్నులవాఁడ వింతే
సొలసి చూపాకాశమే చూరగొనీని

చ. 2:

వెడ వెంట్రుక దూరేటి వీనులవాఁడ నింతే
కడలేని శబ్దము లొక్కట వినేను
నడుమ నే నల్లెఁడంత నాలికెవాఁడ నింతె
వుడివోని సుద్దు లెల్లా నుగ్గడించేను

చ. 2:

లచ్చనఁ బదారంగుళాల ప్రాణ మింతే
కుచ్చి కాలపుదినాలు గొలచీని
కొచ్చిన శ్రీవేంకటేశు కొలువుడుబంట నింతే
పచ్చి యింద్రియాల కెల్లాఁ బంపు సేసేను