పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/395

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0179-04 లలిత సం: 02-395 శరణాగతి

పల్లవి:

హరి నీవే బుద్ధి చెప్పి యాదరించు నామనసు
హరి నీవే నాయంతర్యామివి గాన

చ. 1:

వసముగాని కరివంటిది నామనసు
యెఁసగి సారెకు మదియించీఁ గాన
పొసఁగఁ బాదరసముఁబోలిన నామనసు
అసము దించక సదా అల్లాడీఁ గాన

చ. 2:

వడి నడవుల చింకవంటిది నామనసు
బడిబడిఁ బట్టబట్ట బారీఁ గాన
కడఁగి విసరు పెనుగాలివంటిది మనసు
విడువక కన్నచోట విహరించీఁ గాన

చ. 3:

వరుస నిండుజలధివంటిది నామనసు
వొరసి సర్వము లోనై వుండీఁ గాన
గరిమ శ్రీవేంకటేశ కావవే నామనసు
సరి నీయానతి నీకే శరణనీఁ గాక