పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/394

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0179-03 సాళంగం సం: 02-394 అధ్యాత్మ

పల్లవి:

నీవే మూలమువో నేరిచిన పెద్దలకు
దేవుఁడు నీయందులోనే తిరమాయ నిదివో

చ. 1:

బాపురే వో దేహమా బాపురే వో నీవు
వోపి నేఁ బెట్టినకొద్ది నుందువుగా
రూపు నీవు గలిగితే రుచులెల్లఁ గానఁ గద్దు
చాపలాన ధర్మములు సాధింపఁగలదు

చ. 2:

మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నా-
యిచ్చకొలది నెందైనా నేఁగుదువు గా
అచ్చపు నీకతమున నవుఁగాము లెంచఁ గద్దు
పచ్చిగా యేముర్తినైనా భావించఁగలదు

చ. 3:

మేలు మేలు నాలికె మేలు మేలు నీవు
వోలి యేమాటకునైనా నొనరుదుగా
చాలి నీవు మెలఁగంగ చదువు చదువఁ గద్దు
పోలించి శ్రీవేంకటేశుఁ బొగడఁగఁగలదు