పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/393

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0179-02 బౌళి సం: 02-393 వేంకటగానం

పల్లవి:

ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు

చ. 1:

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు

చ. 2:

సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు

చ. 3:

నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు
ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు