పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/390

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0178-05 శ్రీరాగం సం: 02-390 శరణాగతి

పల్లవి:

అల్పశక్తివాఁడ నేను అధికశక్తివి నీవు
పోల్ప నెంతపనికిఁ బూనితినయ్యా

చ. 1:

నీపదధ్యానములోనే నిండెను నామనసెల్ల
యేపున నీసాకార మేమిట భావింతునయ్య
చూపు నీసింగారమందే చొక్కి తగులాయ నిదె
ఆఁపి నే నీయంగకాంతు ల వేమిట జూతునయ్య

చ. 2:

నాలుక నీకడలేని నామములే నుడిగీవి
మేలిమి నీగుణము లేమిటఁ బొగడుదునయ్య
గాలివంటివీనులు నీకథలఁ దనిసెనయ్య
యీలీల నీయనంతమహిమ యెందు విందునయ్య

చ. 3:

నీకు శరణని యిట్టె నే ధన్యుఁడనైతి
యీకడ నీసేవ సేసి యేమి గట్టుకొందునయ్య
శ్రీకాంతుఁడవైన శ్రీవేంకటేశ నీకు
వూఁకొన నాజన్మఫల మొకమొక్కు చాలునయ్య