పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/298

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0162-01 గౌళ సం: 02-297 దశావతారములు

పల్లవి: ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను
తటుకన నీకీరితి వొగడుదురు తలకొని యిందరును

చ. 1: సురాసురగంధర్వయక్షులు మిమ్ముఁ దెలియఁగలేరు
పరాశరాదులు మీరూపు భావించఁగలేరు
నరు లెరుఁగుదురా మిమ్ము నారాయణ నీవే సులభఁడవై
కరీంద్రుఁ గాచినయటువలెఁ గాతువు గాక

చ. 2: సనాతనబహువేదశాస్త్రంబులు మిమ్ముఁ నుతింపలేవు
అనంతయజ్ఞంబులు మిమ్ము నటు సాధించఁగలేవు
తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను
వినోదముగఁ గాచినయటువలె వెసఁ గాతువు గాక

చ. 3: రమాసతి నీళామహిరామలు మీతలఁ పెఱంగరు
సమేతులైన శేషాదులు మీజాడ మీరలేరు
తమోమయు లిందరును ధరణిధర శ్రీవేంకటేశ
నమోనమో యని మొక్కంగాఁ ననుఁగాతువు గాక