పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/297

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0161-04 లలిత సం: 02-296 శరణాగతి

పల్లవి: ఎట్టు సేయఁగలవాఁడవో యిఁక నీచేతిది నావునికి
నెట్టన నీదాఁసుడనై తిని నీచిత్తం బిఁకను

చ. 1: సారెకుఁ గొలువు‌సేతు చనవులు నీ విత్తువో యనుచు
నేరకున్నాఁ బాడుదును నీవు మెత్తువనుచు
వోరిచి వుపవాసములుండుదు నొగి దయదలంతువో యనుచు
చేరి వాకిలి గాచుకుండుదు చిత్తము రావలెననుచు

చ. 2: కమ్మటి నిచ్చకములు నెరపుదు కైవసము గావలె ననుచు
వుమ్మడి నీగుణాలు వొగడుదు వూరక మొగమోడుదు వనుచు
నెమ్మది మొక్కులు నే మొక్కుదు నేరములెంచక కాతువని
నమ్మి నిన్ను నేఁ బూజింతు నను నీ వీడేరింతువని

చ. 3: ఆసతో నిను భావింతు అన్నిట నన్నేలుదు వనుచు
వేసరక నీమంత్రము నడుగుదు వేగమే వరమొసఁగుదు వనుచు
రాసికి నెక్కఁగ శ్రీవేంకటేశా రక్షించితి విప్పుడు నన్ను
వాసితోడ నే నిన్నుఁ దగులుదును వదలక నాపాలఁ గలవనుచు