పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/295

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0161-02 లలిత సం: 02-294 వైరాగ్య చింత

పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌఁగాము లన్నియును
అతఁడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మముఁ దడవకుమీ

చ. 1: కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే
గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా
సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే
పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా

చ. 2: రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే
అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా
ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే
మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా

చ. 3: యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే
తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా
చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే
అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త