పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0161-01 లలిత సం: 02-293 గురు వందన, నృసింహ

పల్లవి: ఎట్టిదో మీమాయావిలాసము యెఱిఁగిన నెఱఁగనీదు
అట్టె మాగురు ననుమతినే ప్రత్యక్షమవై తివిగాని

చ. 1: కరుణాకరా మిమ్మునుఁ గని తెలియఁగలేను
ధర మీమహిమలు వినివిని తగ నరుదందుదును
నరహరి నీవు నాలో నుండఁగ నమ్మక పురాణకథలందు
అరయఁగ మీచరితలుచెప్పఁగ నాసతోడ మిముఁ దలంతును

చ. 2: జగదీశా మీనామంబులు జపించ నలయుదును
వెగటుగ నీచిత్రసృష్టి చూచి మిము వెదకుదు నింతటను
నగధర మీపై భక్తి సేయఁగ మనంబున వొడఁబడను
పగటున మీరిచ్చు వరములకొరకే పలుమారు మీకుమొక్కుకొందును

చ. 3: శ్రీవేంకటేశా నీమూరితి చింతించి చేపట్టఁగలేను
దేవుఁడ వనియెడు విశ్వాసమునకే తిరముగఁ గొలిచెదను
శ్రీవనితాధిపవేదాలు మిమ్మునుఁ జెప్పఁగానే తర్కింపుదును
వేవేలు పరుషలు సేవింపఁగ నీవే కర్తవని నిశ్చయింతును