పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/293

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0160-06 శుద్ధవసంతం సం: 02-292 అధ్యాత్మ

పల్లవి: ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు
జవళి నెంచిచూచితే సరిబేసివంటివి

చ. 1: అంగనల చూపులు ఆరతులవంటివి
కుంగక నీవు కొలువై కూచున్న వేళ
చెంగట లేఁతనవ్వులు సేసపాలవంటివి
కొంగులు వట్టుచు నీవు కొసరేటివేళ

చ. 2: కాంతల పలుకులెల్లా కప్పురాలవంటివి
అంతలో నీవు సరసాలాడేటివేళ
బంతిమోవుల యీవులు పాలకూళ్లవంటివి
మంతనాననుండి నీవు మన్నించేవేళను

చ. 3: వెలఁదుల కాఁగిళ్లు విడిదిండ్లవంటివి
చలముల నీ రతులు సలిపేవేళ
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తలఁపులవంటివన్నీ తమకపువేళను