పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/291

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0160-04 సామంతం సం: 02-290 అధ్యాత్మ శృంగారము

పల్లవి: ఎంత వలచితివయ్యా యింతికి
చెంతనుంటే లేఁతనవ్వే నేసపాలుగావా

చ. 1: చెలి నీపైఁ జిగురాకు చిదిమివేసితేను
వలరాజడిదమని వంచించితివి
వెలయఁగ విరహపువేళ వాఁడెక్కుఁగాక
మెలుపునఁ గదిసితే మెత్తనేకాదా

చ. 2: బిసరుహాక్షి పుప్పొడి ప్రేమ నీపైఁ జల్లితేను
వసంతుని చొక్కనుచు వసివాడేవు
వెసఁ దెరమరఁగైతే వేగమే నామెక్కుఁగాక
రసికత నొద్దనుంటే రజమే కాదా

చ. 3: అలమేలుమంగ సురటట్టే నీపై విసరితే
మలయానిలు వేఁడంటా మాటువెట్టేవు
తలఁచి శ్రీవేంకటేశ దవ్వైతే వేఁడెక్కుఁగాక
చలపట్టి కూడితివి చల్లనేకాదా