పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/290

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0160-03 సాళంగనాట సం: 02-289 నృసింహ

పల్లవి: జయ జయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద

చ. 1: మిహిరశశినయన మృగనరవేష
బహిరంతస్స్థలపరిపూర్ణ
అహినాయకసింహాసనరాజిత
బహుళగుణగుణ ప్రహ్లాదవరద

చ. 2: చటులపరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌనిప్రణుత
కుటిలదైత్యతతికుక్షివిదారణ
పటువజ్రనఖ ప్రహ్లాదవరద

చ. 3: శ్రీవనితాసంశ్రిత వామాంక
భావజకోటిప్రతిమాన
శ్రీవేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద