పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/288

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0160-01 భైరవి సం: 02-287 భక్తి

పల్లవి: ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది
రవ్వ సేయక జీవుల రక్షించవయ్యా

చ. 1: తలపోసి తలపోసి ధ్యానముసేతురు నిన్ను
యెలమి నింతని నిశ్చయింపలేరు
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు
కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరు

చ. 2: పొదిగి పొదిగి నిన్నుఁ బూజలెల్లాఁ జేతురు
యెదుట నీశ్రీమూర్తి యెఱఁగలేరు
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా
పదిలపు నీభ క్తి పట్టఁగలేరు

చ. 3: నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మెుక్కుదురుగాని
మక్కువ నీమహిమ నమ్మఁగలేరు
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత
తక్కక నిన్ను సేవించి తనియలేరు