పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/286

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0159-04 వరాళి సం: 02-285 అధ్యాత్మ శృంగారము

పల్లవి: ఏఁటి జాణతనమే యేమే నీవు
కోటియైనా యాఁటది కక్కూరితికిఁ జొచ్చునా

చ. 1: వరుసకువచ్చి యావనిత గాచుకుండఁగా
యెరవులసన్నఁ బతినేల పిల్చేవే
తెరమఱంగున నొక్కెతకు మీఁదెత్తిన మోవి
యిరవుగ నీకది యెంగిలిగాదా

చ. 2: పొందైనయాపె యింటిలో బోనము వెట్టుకుండఁగా
విందు నీవేల చెప్పేవే విభునికిని
అందాకె మనసు పెట్టినటువంటి కాఁగిలి-
కిందటనే వాఁడి మిగిలినది గాకా

చ. 3: సేసవెట్టిన మగువ చెఱఁగువట్టుకుండఁగా
ఆసతో నీవెట్టు గూడి యలరితివే
యీసరినే శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
వోసరించితే బువ్వము వూరఁబొత్తుగాదా