పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/282

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0159-01 పాడి సం: 02-281 వైరాగ్య చింత

పల్లవి: చంచలపడఁగవద్దు సారె సారెఁ గోరవద్దు
పొంచుకున్న దైవమే బుద్ధులు నేర్పిరి

చ. 1: లోకరక్షకుఁడు నాలోననే వున్నాఁడిదే
నాకు నభయములిచ్చి నన్నుఁ గాచును
శ్రీకాంతుఁడీతఁడే నాచిత్తములో మలసీని
దాకొని శుభములెల్లాఁ దానే వొసఁగును

చ. 2: పరమపురుషుడు నాప్రాణనాథుఁడైనాఁడు
పరగ నాపాలివాఁడై బ్రదికించును
ధరణీశుఁ డీతఁడే నాదాపుదండై కడఁగీని
నిరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు

చ. 3: శ్రీవేంకటేశుఁడు నాజిహ్వఁ దగిలి వున్నాఁడు
పావనునిఁ జేసి నాకు ఫల మిచ్చును
గోవిందుఁ డీస్వామి నన్నుఁ గొలిపించుకొన్నవాఁడు
యీవల నావల నాకు నిహపరా లిచ్చును