పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/276

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0157-06 సాళంగనాట సం: 02-275 రామ

పల్లవి: కౌసల్యానందనరామ కమలాప్తకులరామ
భాసురవరద జయ పరిపూర్ణరామ

చ. 1: మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు
జనించి తాటకఁ జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి
అనుమతి పరశురామునిచేఁ గైకొంటివి

చ. 2: సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి
అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి
చొప్పుతో మాయమృగము సోదించి హరియించి
కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటివి

చ. 3: సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక
జలధి బంధించి లంక సాధించి
వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించి
చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా