పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/269

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0156-06 ముఖారి సం: 02-268 వైరాగ్య చింత

పల్లవి: ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే
యిందిరారమణు సేవే యిరవైన పదవి

చ. 1: సతులతో నవ్వులు చందమామగుటుకలు
మతితలపోఁత లెండమావులనీళ్ళు
రతులతో మాటలు రావిమానిపువ్వులు
తతి విరహపుకాఁక తాటిమావినీడ

చ. 2: లలనల జవ్వనాలు లక్కపూసకపురులు
నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత
చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు
కొలఁదిలేని ననుపు గోడమీఁది సున్నము

చ. 3: పడఁతుల వేడుకలు పచ్చివడఁగండ్ల గుళ్లు
కడుమోవితీపు చింతకాయకజ్జము
బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁ-
డడరించిన మాయలు అద్దములో నీడలు