పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0156-05 భూపాళం సం: 02-267 అధ్యాత్మ

పల్లవి: మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ
వెదకి హరికథలే వినుచుండవలయు

చ. 1: వెలఁదుల సుద్దులు వీనులను వింటేను
పెలుచుఁజూపులఁ జూడఁ బ్రేమ వుట్టించు
మలసి యాచూపులు మనసునఁ దగిలించు
తలఁపు మాటాలాడఁ దమిరేఁచును

చ. 2: మగువలతోడుత మాటలాడ దొరకొంటే
నగినగి సంసారాలనంటు గల్పించు
తగిలిన నవ్వులు తనువులు సోఁకింపించు
మిగులాఁ దనుసోకులే మించి వలపించును

చ. 3: సతులతో మోహము సంపదలు పోరించు
అతిసంపదలు దేహి నజ్ఞానిఁ జేయు
తతి నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడే
గతియని కొలిచితే ఘనునిఁగా జేయును