పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/265

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0156-02 గౌళ సం: 02-264 హరిదాసులు

పల్లవి: నమ్మవలెఁగాని యెన్నఁడు సందేహము లేక
యిమ్ముల దేవుఁడు వరమిచ్చు టేమరుదు

చ. 1: మగనిపై బత్తిసేసి మంచిలోకా లెక్కేరట
తగుదండకోల వట్టి తత్త్వగతి గనేరట
పగటున నొకవేరు వట్టి పాముఁ బట్టేరట
తగిలి హరిదాసులు ధన్యు లౌ టేమరుదు

చ. 2: యేలికెకు ధనమిచ్చి హితభోగా లందేరట
కేలఁ గత్తివూని పగ గెల్చేరట
గాలి లోలోఁ బూరించి ఘనసిద్ధు లయ్యేరట
యేలీల హరిదాసులు యీడేరు టేమరుదు

చ. 3: దిక్కుల యజ్ఞాలు చేసి దివిజు లయ్యేరట
మొక్కి విప్రుల నర్చించి ముంచి సిరు లందేరట
పక్కన నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరుఁ
జక్కనఁ గొల్చిన దాసులు జ్ఞాను లౌ టేమరుదు