పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/264

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0156-01 శంకరాభరణం సం: 02-263 శరణాగతి

పల్లవి: నీచిత్తము నాభాగ్యము నే నెంతటివాఁడను
యేచి నీవు రక్షించేదే యెక్కుడుపుణ్య మింతే

చ. 1: పాటించి నీభావము పట్టవశమా తలఁచి
మేటి నామనసు నీకు మీఁదెత్తు టింతే
నూటికైన నీనామము నుడుగఁగ వశమా
మాటలు నీసెలవుగా నుట్టుపెట్టుటింతే

చ. 2: వేవేలైన నీకథలు వినఁగ నాతరమా
సోవగా వీనులు తావు చూపుట యింతే
దేవ నీసాకారము ద్రిష్టించ నావశమా
పావనముగా నందులోఁ బనిగొను టింతే

చ. 3: గట్టిగా నిన్నుఁ బూజించఁ గమ్మటి నావశమా
నెట్టిన నామేను నీకు నేమించు టింతే
పట్టపలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
జట్టిగొనుకొరకు నీశరణను టింతే