పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/263

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0155-06 దేసాక్షి సం: 02-262 వేంకటగానం

పల్లవి: ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా

చ. 1: లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట
ఆకాశ మింతంతని యనరాదట
మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట
శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా

చ. 2: అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట
వెలయఁ గాలము గంటు వేయరాదట
కలయ నలుదిక్కులకడ గానఁగరాదట
జలజాక్ష నీరూపు తలపోయఁగలనా

చ. 3: కేవలమైన నీమాయ గెలువనేరాదట
భావించి మనఁసు జక్కఁ బట్టరాదట
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా