పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/260

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0155-03 దేసాళం సం: 02-259 అధ్యాత్మ

పల్లవి: అంతరంగములో నున్న హరియే గతిగాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును

చ. 1: పుట్టించిన కర్మమే పోషించకుండునట
బెట్టుగా మనసే మఱపించునట
పట్టైన మేనే ఆసల బతిమాలింపించునట
చుట్టములెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని

చ. 2: పక్కన విత్తినభూమి పంట వండకుండునట
యెక్కడా మాయే భ్రమయింపించునట
అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసునట
దిక్కు దెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను

చ. 3: ఆసలఁ బెట్టే పాయమే అటమటమౌనట
సేసే సంసారమే జ్ఞానిఁ జేయునట
వేసరక యింతకూ శ్రీవేంకటేశు డేలికట
వెూసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి