పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/258

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0155-01 సామంతం సం: 02-257 వైష్ణవ భక్తి

పల్లవి: సొరిది మమ్మిట దయఁజూతువు గాకా
వెరసి మరి యొక్కడా నేమి విన్నవించే మిఁకను

చ. 1: తలఁచితి నీరూపము తగిలితి నీపాదాలు
కలసితి నీదాసుల గమిలోనను
చలివాసె భవములు సడిదీరెఁ గర్మములు
యెలమి నీమహిమలు యేమి చెప్పే మిఁకను

చ. 2: నీముద్రలు ధరించితి నీగుణాలు వొగడితి
చేముట్టి పూజించితి శ్రీయంగాలు
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము
గోమున మరేమి నిన్ను కొసరే మిఁకను

చ. 3: తిరుమణి ధరించితి తీర్థపస్రాదాలు గొంటి
విరవైన నీకథలు వీనుల వింటి
పరగ శ్రీవేంకటేశ పరము నిహముఁ గంటి
అరసి యితర మేమి ఆశపడే మిఁకను