పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/257

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0154-05 కాంబోది సం: 02-256 వైరాగ్య చింత

పల్లవి: ఇన్నాళ్లు నందునందు నేమి గంటివి
అన్నిటా శరణు చొచ్చి హరి నిన్నుఁ గంటిని

చ. 1: అంగనల పసఁజిక్కి అలయికలే కంటి
బంగారువెంటఁ దగిలి భ్రమ గంటిని
ముంగిటిక్షేత్రాలంటి ముంచి వెట్టిసేయఁ గంటి
అంగపు నన్నే చూచి అంతరాత్మఁ గంటి

చ. 2: చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి
మట్టులేని వయసుతో మదము గంటి
వట్టికామములుసేసి వరుస మాయలు గంటి
పట్టి నారాయణాయని భక్తి నిన్నుఁ గంటిని

చ. 3: వింతచదువులవల్ల వేవేలుమతాలు గంటి
సంతకర్మములవల్ల సాము గంటిని
యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము
చింతించి అందులోన నీ శ్రీపాదాలు గంటి