పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/256

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0154-04 కేదారగౌళ సం: 02-255 శరణాగతి

పల్లవి: కమలారమణ నీకల్పితపుమానిసిని
తమితోడ నాదిక్కు దయఁ జూడవే

చ. 1: ఆరీతి బ్రాహ్మణుఁడ ననుటేకాని దేహము
కోరి యాచారమునకుఁ గొలుపదు
పేరు వైష్ణవుఁడననే పెద్దరికమే కాని
సారమైన మనసులో జ్ఞానమే లేదు

చ. 2: చదివితిననియెడి చలపాద మింతే కాని
అదన నందులోని ‌అర్థ మెఱఁగ
పదిరిసంసారమనే బహురూపమే కాని
చతురుఁదనాన నందు సమర్థుఁడఁ గాను

చ. 3: దేవ మీభక్తుఁడననే తేజ మొకటె కాని
చేవమీర నినుఁ బూజించ నేరను
శ్రీవేంకటేశ నీచేతిలోనివాఁడ నేను
భావించి మఱి యేపాపము నెఱఁగను